టాస్‌ కూడా వేయకుండానే… లార్డ్స్‌లో విడవని వర్షం…


ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ఓడిన టీమ్‌ఇండియా.. రెండో టెస్టును ఎలా ఆరంభిస్తుంది..? టాస్‌ ఎవరు గెలుస్తారు..? భారత్‌ ఈసారి మొదట బ్యాటింగ్‌ చేస్తుందా.. బౌలింగ్‌ చేస్తుందా..? తుది జట్టు ఎలా ఉంటుంది..? ఎవరిపై వేటు పడుతుంది..? ఎవరికి అవకాశం దక్కుతుంది..? తొలి రోజు ఎవరు పైచేయి సాధిస్తారు..? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలతో.. ఎంతో ఆసక్తితో లార్డ్స్‌ టెస్టుకు సిద్ధమయ్యారు భారత అభిమానులు. కానీ తొలి రోజు అసలు ఆటే సాగలేదు. గురువారం వరుణుడి ప్రతాపంతో ఆట పూర్తిగా రద్దయింది. ఒక్క బంతీ పడలేదు. కనీసం టాస్‌ కూడా వేసే అవకాశం లేకపోయింది.

లండన్‌
లార్డ్స్‌లో మ్యాచ్‌ ఆరంభానికి ముందు నుంచే వర్షం మొదలైంది. అది సాయంత్రం వరకు కొనసాగింది. మధ్యాహ్నం వరుణుడు కరుణిస్తే మ్యాచ్‌ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆరంభించాలన్న ఉద్దేశంతో నిర్ణీత సమయాని కంటే అరగంట ముందే అంపైర్లు భోజన విరామం కూడా ఇచ్చారు. కానీ ఆ తర్వాత కూడా వర్షం తెరపినివ్వలేదు. పిచ్‌పై కవర్లు కప్పే ఉంచారు. టీ విరామం తర్వాత వర్షం కొంచెం తగ్గుముఖం పట్టడంతో అంపైర్లు వచ్చి మైదానాన్ని పరిశీలించారు. కానీ ఆట నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలం కాదని తేలడంతో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.50 గంటలకు తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. టాస్‌ కూడా వేయని నేపథ్యంలో భారత్‌ తుది జట్టును ప్రకటించలేదు. ఇంగ్లాండ్‌ ముందు రోజే 12 మందితో జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆట రద్దయిన నేపథ్యంలో మిగతా నాలుగు రోజుల్లో 96 ఓవర్ల చొప్పున వేయించాలని అంపైర్లు నిర్ణయించారు. లార్డ్స్‌లో ఈ వారమంతా వర్షాలు పడతాయని ముందే సంకేతాలు అందాయి. ఐతే శుక్రవారం మాత్రం వర్షం పడకపోవచ్చని.. ఎండ కాసే అవకాశముందని.. ఆట సజావుగానే సాగొచ్చని అంచనాలుండటం శుభసూచకమే. బౌలర్లకు అనుకూలించే పరిస్థితులుండే లార్డ్స్‌లో ఆట నాలుగు రోజులు సజావుగా సాగినా ఫలితం వచ్చేందుకు ఆస్కారముంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *