సెప్టెంబేర్‌ రూ.12.5 లక్షల కోట్లు కరిగిన మదుపర్ల సంపద

సెప్టెంబరు మదుపర్లను ‘బేర్‌’మనిపించింది. మదుపర్ల సంపదకు భారీగా గండి పడింది. గత ఆరు నెలల కాలంలోనే తొలి నెలవారీ నష్టాలు నమోదయ్యాయి. చాలా తక్కువ షేర్లు ఈ నెలలో లాభాలను నమోదు చేయగా.. ఎక్కువ షేర్లు భారీ పతనానికి గురయ్యాయి. చూద్దాం ఈ ఏడాదిలో ఇంకా ఎన్ని హెచ్చుతగ్గులు కనిపిస్తాయో.. మదుపర్ల సంపద ఏ తీరానికి చేరుతుందో.
మార్కెట్‌ ఈ నెలలో అంతగా పడిపోవడానికి కారణాలు లేకపోలేదు. చమురు ధరలు, రూపాయి క్షీణత, వాణిజ్య యుద్ధ భయాలు కలిసి మార్కెట్‌ను కూలదోశాయి. వీటికి తోడు బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీల(ఎన్‌బీఎఫ్‌సీ) ద్రవ్యలభ్యతపై ఆందోళనలను కూడా ఒత్తిడికి గురి చూశాయి. అందుకేనేమో సెప్టెంబరులో సెన్సెక్స్‌ 2418 పాయింట్లు (5%) నష్టపోగా.. మదుపర్ల సంపద రూ.12.5 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఆగస్టు 31న బీఎస్‌ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ రూ.159.35 లక్షల కోట్లుగా ఉండగా.. సెప్టెంబరు 27 నాటికి రూ.146.86 లక్షల కోట్లకు పరిమితమైంది.

ఈ సమయంలో ఏం చేయాలి
ఓ షేరు 20% పడిపోయిందంటే దాని అర్థం కొనుగోలు చేయవచ్చని కాదని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ ఒకటి అంటోంది. దాని విలువ సరైనదేనా.. కంపెనీ స్వల్పకాల, దీర్ఘకాల అంచనాలు ఎలా ఉన్నాయో గమనించాల్సి ఉంటుందని చెబుతోంది. కేవలం షేరు విలువను కాకుండా.. మూలాలను బట్టి కొనుగోలు చేయాలని సిఫారసు చేస్తోంది.

మార్కెట్‌ ఈ సమయంలో అనిశ్చితిగానే కనిపిస్తోంది. అయితే కొన్ని పెద్ద స్థాయి కంపెనీలు, మధ్యస్థాయి, చిన్న స్థాయి కంపెనీలతో పోలిస్తే మెరుగ్గా కనిపిస్తున్నాయి. విద్యుత్‌, ఎగుమతులు, తయారీ రంగాలతో పాటు.. డిపాజిట్లను గట్టిగా సేకరించగలిగే బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టడం మంచిదని ఓ దేశీయ బ్రోకరేజీ సంస్థ అంచనా వేస్తోంది.

ఇటువంటి దిద్దుబాట్ల వల్ల మంచి షేర్ల ఎంపికకు వీలవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే కొన్ని మ్యూచువల్‌ ఫండ్‌లు బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం బ్యాంకు షేర్లను కొనడం ప్రస్తుతానికి మంచిది కాదని.. స్వల్పకాల మదుపర్లు పడినపుడల్లా కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. మూడేళ్లు, అయిదేళ్ల పాటు అయితే ప్రస్తుత స్థాయిల్లో కొనుగోళ్లు మంచివి కానీ.. 6 నెలలు, ఏడాదికైతే మార్కెట్లకు దూరంగా ఉండడం మంచిదని అంటున్నారు. నిఫ్టీ డిసెంబరు 2018కల్లా 10,500 చేరొచ్చన్న అంచనాను కారణంగా చూపుతున్నారు.

వీటి పొలాల్లో మొలకలొచ్చాయ్‌..
* ఈ నష్టాల్లోనూ వేదాంతా, విప్రో, టాటా స్టీల్‌, బజాజ్‌ ఆటో, ఓఎన్‌జీసీ వంటి కొన్ని పెద్ద షేర్లు; బయోకాన్‌, రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ వంటి మధ్య స్థాయి షేర్లు లాభాలను అందుకున్నాయి.
* ఏబీబీ, దివీస్‌ ల్యాబ్స్‌, ముతూట్‌ ఫైనాన్స్‌, జిందాల్‌ స్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌, టీవీఎస్‌ మోటార్‌, జిలెట్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌ వంటి మధ్యస్థాయి షేర్లు కూడా 1-10% రాణించాయి.
* చిన్న షేర్లలో హాత్‌వే, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌, బాంబే రేయాన్‌ ఫ్యాషన్స్‌, త్రివేణి ఇంజినీరింగ్‌, డీసీఎమ్‌ శ్రీరామ్‌, ఆల్‌సెక్‌ టెక్నాలజీస్‌లు 15% పైగా పెరిగాయి. ధమ్‌పూర్‌ షుగర్‌ మిల్స్‌(50%), అవధ్‌ షుగర్‌ అండ్‌ ఎనర్జీ(37%), బజాజ్‌ హిందుస్థాన్‌ షుగర్‌(36%), దాల్మియా భారత్‌(29%), ఉత్తమ్‌ షుగర్‌ మిల్స్‌(28%), ద్వారికేశ్‌ షుగర్‌(27%) వంటి చక్కెర షేర్లు లాభాలే పొందాయి.

చతికిలబడ్డాయ్‌ ఇవి..
* ఈ మార్కెట్‌ పతనంలో చిన్న షేర్లే ఎక్కువ బాధపడ్డాయి. వీటిలో 90- 60 శాతం దాకా పతనం కావడం గమనార్హం.
* దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, ఇండియన్‌ బ్యాంక్‌, రిలయన్స్‌ పవర్‌, ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌లు 55 శాతం వరకూ దిగాలు పడ్డాయి.
* ఇక యెస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీలు 20-40 శాతం మేర చతికిలబడ్డాయి.

మదుపరీ.. ఇవీ గమనించు
గత నెలరోజుల్లో పరిణామాలు మార్కెట్‌ను, మదుపరి ఆశలను నీరుగారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు కొన్ని అంశాలను గమనించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. అవి మీ పెట్టుబడులపై ప్రభావాన్ని చూపొచ్చు. అవేమిటంటే..

చమురు, రూపాయి
ఎక్కువ ప్రభావం చూపింది ఈ రెండే. ఒకటి పెరిగి.. మరొకటి తరిగి మార్కెట్లపై ఒత్తిడిని తీసుకువచ్చాయన్నమాట వాస్తవం. రూపాయి క్షీణత వల్ల ఎగుమతిదార్లు మాత్రం ప్రయోజనం పొందారు. కానీ దేశీయంగా ధరలు పెరగడానికి కారణమైంది. ఇక చమురు దిగుమతి దేశంగా ఉన్న భారత్‌పై 80 డాలర్లకు చేరిన పీపా ధర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. త్వరలో ఇది 100 డాలర్లకు కూడా చేరుతుందన్న భయాలు ఉన్నాయి.

ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు
ఈ రెండూ కూడా వినియోగదారు కొనుగోలు శక్తిని నిర్ణయించేవే. ఆహార ధరలు తగ్గడంతో రిటైల్‌, టోకు ద్రవ్యోల్బణం దిగివచ్చాయి. భవిష్యత్‌లో షేర్ల ధరలపై ప్రభావం చూపే అంశాల్లో ద్రవ్యోల్బణం కీలకం కానుంది. ఇక దీనిపై ఆధారపడే ఆర్‌బీఐ వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటుంది. జూన్‌ నుంచి ఇప్పటిదాకా రెండు సార్లు రెపో రేటును పెంచింది కూడా. ఆర్‌బీఐ నిర్ణయాలు కూడా మార్కెట్‌కు దిశానిర్దేశం చేయవచ్చు.

ఎన్నికలు, స్థూల ఆర్థికం, కంపెనీల ఫలితాలు
సమీప భవిష్యత్‌లో దేశంలో చోటు చేసుకోబోయే అతిపెద్ద పరిణామం ఎన్నికలే. స్టాక్‌ మార్కెట్‌పైనా ఇవి గట్టి ప్రభావాన్నే చూపగలవు. ఓటరు నిర్ణయం ఏదైనా ప్రభావం తప్పదు. ఇక స్థూలంగా చూస్తే భారత్‌ వేంగా వృద్ధి చెందుతున్న దేశంగా పేరున్నప్పటికీ.. కరెంట్‌ ఖాతా లోటు పెరుగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం 2018-19లో 3.3 శాతానికి పరిమితం చేస్తామని చెబుతోంది. ఇక కంపెనీలు లాభదాయకతను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కమొడిటీ ధరలు తగ్గడం వీటికి కలిసివస్తోంది. అయితే వీరికి రుణ వ్యయాలు మాత్రం భారంగానే ఉంటున్నాయి.

అంతర్జాతీయ అంశాలు
అమెరికా, చైనాల మధ్య అంతకంతకూ రాజుకుంటున్న వాణిజ్య యుద్ధం కారణంగా ఎగుమతి ఆధారిత షేర్లకు భారీ అవకాశాలు వస్తున్నాయి. భారత్‌ కూడా ఈ పరిణామం నుంచి సానుకూలతలను అందుకునే అవకాశం ఉంది. ఇక బ్రెగ్జిట్‌ పరిణామాలు, అమెరికా ఆర్థిక వృద్ధి, డాలరు బలోపేతం, విదేశీ మదుపర్ల నిధుల ప్రవాహం తదితరాలు కూడా కీలకం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *