ఏపీ కాంగ్రెస్‌ తుది జాబితా…

4 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు
విశాఖ లోక్‌సభకు రమణికుమారి

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ తుది జాబితా విడుదలైంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆమోదించిన జాబితాను గురువారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్‌వాస్నిక్‌ విడుదల చేశారు. విజయవాడ లోక్‌సభ స్థానానికి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు, విశాఖపట్నం నుంచి పార్టీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, నంద్యాల నుంచి జె.లక్ష్మీనారాయణ యాదవ్‌ పేర్లు ఖరారయ్యాయి. మిగిలిన 22 పేర్లు తొలి జాబితాలో విడుదల చేసిన విషయం విదితమే.

విజయవాడ లోక్‌సభ స్థానానికి పీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పేరును తొలుత పరిశీలించినప్పటికీ కాపు సామాజికవర్గానికి ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి పట్టుబట్టడంతో నరహరశెట్టి నరసింహారావుకు కేటాయించినట్లు సమాచారం. అదేవిధంగా విశాఖ లోక్‌సభ స్థానంలో ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి పోటీకి విముఖత చూపడంతో మహిళల కోటాలో రమణికుమారికి కేటాయించినట్లు తెలిసింది. సుంకర పద్మశ్రీకి ఇప్పటికే గన్నవరం అసెంబ్లీ స్థానం కేటాయించగా ఆమె పోటీకి ఆసక్తి చూపడం లేదని సమాచారం.

అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తొలి జాబితాలో 132 స్థానాలకు ఖరారు చేయగా మిగిలిన స్థానాల అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేశారు. విశాఖ తూర్పు స్థానాన్ని తొలుత పిరిడి భగత్‌కు కేటాయించగా తాజా జాబితాలో విజ్జిపర్తి శ్రీనివాసరావుకు కేటాయించారు. భగత్‌కు విశాఖ పశ్చిమ స్థానం ఖరారు చేశారు. పిఠాపురం నుంచి తొలుత పంతం ఇందిరకు కేటాయించగా తాజా జాబితాలో మేడిది వెంకట శ్రీనివాసరావుకు కేటాయించారు. రామచంద్రపురం స్థానాన్ని తొలుత మూసిని రామకృష్ణకు కేటాయించగా తాజా జాబితాలో ఇసుకపట్ల సతీశ్‌కుమార్‌కు ఇచ్చారు. ఆలూరు సీటు తొలుత షేక్‌షావలికి కేటాయించగా తాజా జాబితాలో డి.ఆశాబేగానికి ఇచ్చారు.

అన్ని వర్గాలకూ న్యాయం: రఘువీరా
కళ్యాణదుర్గం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాను కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేసిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. అన్ని వర్గాలకూ న్యాయం చేసేలా అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. ఎంపిక చేసిన అభ్యర్థుల్లో 110 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారని చెప్పారు. గురువారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళలకు 18, యువతకు 57 అసెంబ్లీ సీట్లు ఇచ్చి సమతుల్యత పాటించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *