రివ్యూ‌: కేరాఫ్ కంచ‌ర‌పాలెం…

చిత్రం: కేరాఫ్ కంచ‌ర‌పాలెం
నటీనటులు: సుబ్బారావు, రాధాబెస్సి, కేశ‌వ క‌ర్రి, నిత్య‌శ్రీ గోరు, కార్తిక్ ర‌త్నం, విజ‌య ప్ర‌వీణ‌, మోహ‌న్ భ‌గ‌త్, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్ త‌దిత‌రులు
సంగీతం: స్వీకర్‌ అగ‌స్తి
ఛాయాగ్ర‌హ‌ణం: ఆదిత్య జ‌వ్వాడి, వ‌రుణ్ ఛాపేక‌ర్
కూర్పు: రవితేజ గిరిజిల
నిర్మాత‌: విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి
దర్శకత్వం: వెంకటేశ్ మ‌హా
స‌మ‌ర్ప‌ణ‌: ద‌గ్గుపాటి రానా
విడుద‌ల‌: 7-09-2018

జీవితాల్లోంచి వ‌చ్చిన క‌థ‌లు చూపించే ప్ర‌భావ‌మే వేరు. థియేట‌ర్లోకి అడుగుపెట్టిన వెంట‌నే మ‌న‌ల్ని ఓ కొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ‌తాయి. ఆ క‌థ‌లో మ‌న‌ల్నీ భాగం చేస్తాయి. ప్ర‌తి భావోద్వేగం మ‌న‌దే అనే భావ‌న‌కి గురిచేస్తాయి. బ‌య‌టికొచ్చాక ఆ పాత్ర‌లు నేరుగా మ‌న‌తోపాటే ఇంటికొస్తాయి. స‌రాస‌రి మ‌న హృద‌యాల్లో తిష్ఠ వేస్తాయి. కొన్నాళ్ల‌పాటు వెంటాడుతూ… తీయ‌టి అనుభూతుల్ని, జ్ఞాప‌కాల్ని పంచుతాయి. ఇలాంటి క‌థ‌లు తెలుగులో అరుదుగానే తెర‌కెక్కుతుంటాయి. అప్పుడ‌ప్పుడు వ‌చ్చినా వాటికి స‌రైన వేదిక, ప్ర‌చారం దొర‌క్క మ‌రుగున ప‌డిపోతుంటాయి. ‘కేరాఫ్‌ కంచ‌ర‌పాలెం’ విష‌యంలో మాత్రం ఆ త‌ప్పు జ‌ర‌గ‌లేదు. యువ క‌థానాయ‌కుడు రానా ఈ సినిమాకి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తూ త‌న‌దైన శైలిలో సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. ఎంతోమంది తారలు, ప్ర‌ముఖులు ఈ సినిమాని చూసి గొప్ప ప్ర‌య‌త్నం అని మెచ్చుకున్నారు.

క‌థేంటంటే: కంచ‌ర‌పాలెం అనే ఊళ్లో జ‌రిగే క‌థ ఇది. ఆ ఊరికి చెందిన రాజు (సుబ్బారావు) ఓ అటెండ‌ర్‌. 49 ఏళ్లు వచ్చినా… పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తుంటాడు. వ‌య‌సు మీద‌ప‌డినా పెళ్లి చేసుకోలేదంటూ ఊళ్లో అంతా రాజు గురించి ర‌క‌ర‌కాలుగా మాట్లాడుతుంటారు. ఇంత‌లో అత‌ను ప‌నిచేసే ఆఫీసుకి అధికారిగా ఒడిశా నుండి వస్తుంది రాధ (రాధ బెస్సీ). భర్త చనిపోయిన ఆమెకు ఇర‌వ‌య్యేళ్ల కూతురు ఉంటుంది. అటెండ‌ర్ అయినా రాజు మంచి మ‌న‌సుని చూసి రాధ ప్రేమ‌లో ప‌డుతుంది. అదే ఊరికి చెందిన జోసెఫ్ (కార్తీక్ రత్నం), భార్గవి (ప్రణీతా పట్నాయక్)ల‌ది మ‌రో క‌థ‌. మ‌తాలు వేరైనా ఆ ఇద్ద‌రూ అనుకోకుండా ప్రేమ‌లో ప‌డ‌తారు. ఊళ్లోని వైన్ షాప్‌లో ప‌నిచేసే గడ్డం (మోహన్ భగత్)కి కూడా ఓ ప్రేమ‌క‌థ ఉంటుంది. సలీమా(విజయ ప్రవీణ) అనే వేశ్య క‌ళ్ల‌ని చూసి ప్రేమిస్తాడు. స్కూల్‌కి వెళ్లే సుందరం (కేశవ కర్రి)కి, త‌న స‌హాధ్యాయిని సునీత (నిత్య శ్రీ) అంటే చాలా ఇష్టం. ఇలా వీళ్లంద‌రి ప్రేమ‌క‌థలు ఎలాంటి మ‌లుపులు తిరిగాయన్న‌దే ఈ చిత్రం.

ఎలా ఉందంటే: కొన్ని జీవితాల్ని గోడ చాటు నుంచి చూస్తే ఎలా ఉంటుందో, అలాంటి అనుభూతిని పంచే చిత్ర‌మిది. ప్ర‌తి జీవితంలోనూ ఓ ఆర్ద్రత ఉంటుంది. దాన్ని ప‌క్కాగా తెర‌పైకి తీసుకురావ‌డం ఇంత సులువా అని ఆశ్చ‌ర్యానికి గురిచేసే చిత్ర‌మిది. జీవితాల్లో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల్ని గుర్తు చేసుకొని న‌వ్వుకోవ‌డం, బాధ‌ప‌డటం ప్ర‌తి ఒక్క‌రికీ అనుభ‌వ‌మే. వాటిని మ‌రొక‌సారి గుర్తు చేస్తూ, ఆ సంఘ‌ట‌న‌ల్ని మ‌రొక‌సారి క‌ళ్ల‌కు క‌ట్టే చిత్ర‌మిది. స‌మాజంలోని కుల‌మ‌తాలు, మ‌నుషుల మ‌ధ్య అంత‌రాలు… వాటి తాలూకు గాయాలు, మ‌చ్చ‌ల్ని సుతిమెత్త‌గా ఎత్తిచూపే ప్ర‌య‌త్నం కూడా ఇందులో క‌నిపిస్తుంది. 2. గంట‌ల 25 నిమిషాల సినిమాలో ఇన్ని విష‌యాలు చెప్పొచ్చా అని విస్మ‌యానికి గురిచేసే చిత్ర‌మిది.

సినిమా ఆరంభం కాగానే ప్రేక్ష‌కులంతా కంచ‌ర‌పాలెంలో విహ‌రించ‌డం మొద‌లుపెడ‌తారు. ఒకొక్క‌టిగా ప‌రిచ‌య‌మ‌య్యే పాత్ర‌ల్ని మ‌చ్చిక చేసుకొని వాటితో క‌లిసి ప్ర‌యాణం చేస్తారు. అక్క‌డ్నుంచి ప్ర‌తి భావోద్వేగం మ‌న‌దే. ఈ సినిమాలో న‌వ్వించాలి, ఏడిపించాలి, ప్రేమ పండాలి అంటూ… అందుకోసం ట్రాక్‌లు, క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించ‌డం తెలుగు సినిమాల్లో చూస్తూనే ఉంటాం. కానీ, ఇక్క‌డ అలాంటి ప్ర‌య‌త్నాలేవీ క‌నిపించ‌వు. ప్ర‌తి పాత్ర న‌వ్విస్తుంది, ఏడిపిస్తుంది, జాలి క‌లిగేలా చేస్తుంది. జీవితాల్లోంచి పుట్టిన క‌థ‌ల ప్ర‌భావం అలాంటిది. కులాల గురించి, మ‌తాల గురించి ఓ క‌థ‌లో ప్ర‌స్తావించాలంటే అది ఎంత పెద్ద సాహ‌సం? కానీ, ద‌ర్శ‌కుడు అవ‌లీల‌గా ఆ ప్ర‌య‌త్నం చేసి, ప్రేక్ష‌కుల‌తో చ‌ప్ప‌ట్లు కొట్టిస్తాడు. త‌న త‌ల్లి ప్రేమ‌ని గెలిపించేందుకు, ఆమె ఇంట్లో నుంచి పారిపోయేలా ఇర‌వ‌య్యేళ్ల కూతురు సాయం చేస్తుందంటే అస‌లు అలాంటి పాత్ర‌ల్ని ఊహించ‌గ‌ల‌మా? ప్రేమించిన అమ్మాయి వేశ్య అని తెలిసినా ఆమెతో ముద్దు ముచ్చ‌ట్ల‌న్నీ పెళ్లి త‌ర్వాతే అని చెప్పే ఓ ప్రేమికుడుంటాడా? ఇలాంటి ఎన్నో సాహ‌సాలు ఈ సినిమాలో క‌నిపిస్తాయి.

జోసెఫ్‌, భార్గ‌వి ప్రేమ క‌థ నేటి స‌మాజంలోని సంఘ‌ట‌న‌ల్ని ప్ర‌తిబింబిస్తే… సుంద‌రం, సునీత‌లు బాల్యంలోకి తీసుకెళ‌తారు. చిన్న‌ప్పుడు జాత‌ర్లో క‌నిపించిన పాట‌ల పుస్త‌కాలు, కాళ్లు అంద‌క‌పోయినా తొక్కే సైకిలు, కింద‌ప‌డిన‌ప్పుడు దానిపై క‌లిగిన కోపం, తాటాకు గొడుగులు.. ఇవ‌న్నీ సుంద‌రం గుర్తు చేస్తాడు. బాల్యంనాటి స్నేహం, ప్రేమ తాలూకు జ్ఞాప‌కాల్ని సునీత పాత్ర గుర్తు చేస్తుంది. సుంద‌రం తండ్రి పాత్ర‌, ఆ నేప‌థ్యంలో స‌న్నివేశాలు హృద‌యాల్ని మెలిపెడ‌తాయి. అస‌లు ఈ క‌థ‌లన్నింటికీ ముగింపు ఎలా అనుకొంటుండ‌గానే ఓ గొప్ప మ‌లుపు. అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: ఈ సినిమాలో ప్ర‌తి పాత్ర హీరోనే. కంచ‌ర‌పాలెం అనే ఊరికి చెందినవాళ్లే 52 మంది ఇందులో న‌టించారు. ఎవ‌రికీ మేక‌ప్ ఉండ‌దు. నిజ జీవితాల్లో ఎలా క‌నిపిస్తుంటారో, తెర‌పై కూడా అంతే. సినిమా చూసి బ‌య‌టికొచ్చాక ప్ర‌తి చిన్న పాత్ర కూడా గుర్తుండిపోతుంది. న‌టీన‌టులు కొత్త‌వాళ్ల‌యినా పాత్ర‌ల్లో జీవించారు. సుంద‌రం తండ్రి పాత్ర, ఆయ‌న అభిన‌యం ప్రేక్ష‌కుల‌పై ప్ర‌త్యేక‌మైన ప్ర‌భావం చూపుతుంది. సింక్ సౌండ్‌తో నేరుగా లైవ్ రికార్డింగ్‌గా ఈ సినిమా తీర్చిదిద్దారు. అది మ‌రింత సహజత్వాన్ని తీసుకొచ్చింది. స్వీక‌ర్ అగస్తి సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది.

ఆదిత్య జవ్వాడి, వరుణ్‌ ఛాపేకర్ ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. రవితేజ గిరిజిల కూర్పు, నాగార్జున తాళ్ల‌ప‌ల్లి సౌండ్ డిజైనింగ్ బాగా కుదిరాయి. వెంక‌టేష్ మ‌హా ఆలోచ‌న‌ల్లోని ప‌రిణ‌తికి అద్దం ప‌డుతుందీ చిత్రం. ఆయ‌న చిత్రాన్ని తెర‌కెక్కించిన విధానం, పాత్ర‌ల్ని ముడిపెట్టిన విధానం చాలా బాగుంది. ఇండిపెండెంట్ సినిమా కాబ‌ట్టి, అందుకు త‌గ్గ‌ట్టుగానే ఉన్నాయి నిర్మాణ విలువ‌లు. నిర్మాత విజ‌య ప్ర‌వీణ ప‌రుచూరి చిత్రంలో స‌లీమా అనే కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ఆమె అభిన‌యం ఎంత బాగుందో, ఈ సినిమా క‌థ‌ని నిర్మించిన ఆమె అభిరుచి అంత‌కంటే గొప్ప‌గా ఉంది.

బ‌లాలు
+ వాస్త‌విక‌త‌
+ న‌టీన‌టులు
+ సాంకేతిక నిపుణుల ప‌నిత‌నం

బ‌లహీన‌త‌లు
– నిదానంగా సాగే స్క్రీన్ ప్లే

చివ‌రిగా: కేరాఫ్ కంచ‌ర‌పాలెం ఇది సినిమా కాదు.. జీవితం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *