యువాహ్‌నాలు..నయా విడుదల..

మధ్యతరగతి మారాజుల కోసం ఫోర్డ్‌ ఫిగో ఫేస్‌లిఫ్ట్‌… స్టైల్‌, వేగాన్ని ఇష్టపడే బైకర్లకు నచ్చేలా యమహా ఎంటీ-15…ఈ వారంలోనే విడుదలయ్యాయి…కారుదేమో హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌… బైక్‌ వచ్చింది స్ట్రీట్‌ ఫైటర్‌ విభాగంలో… తక్కువ ధరలో అత్యధిక ఫీచర్లు అందిస్తుండటం వీటి ప్రత్యేకత అంటున్నారు నిపుణులు…ఆ వివరాలేంటో చదివేస్తూ అలాఅలా రైడింగ్‌ చేసేద్దాం.

స్ట్రీట్‌ ఫైటర్‌
యువతే లక్ష్యంగా నగర రోడ్లపై దూసుకెళ్లడానికి సూపర్‌ మోటార్డ్‌ అర్బన్‌ స్ట్రీట్‌ ఫైటర్‌ విభాగంలో వచ్చేసింది యమహా ఎంటీ 15. ఎంటీ అంటే మాస్టర్‌ ఆఫ్‌ టార్క్‌ అని అర్థం. దానికి తగ్గట్టే లక్షన్నర బడ్జెట్‌లో శక్తిమంతమైన సామర్థ్యంతో పరుగులు తీస్తుందిది.

ప్రత్యేకత: ఎంటీ విభాగంలో ఇప్పటికే 09, 10 అనే 1000సీసీ హై-ఎండ్‌ మోటార్‌సైకిళ్లు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవుతున్నాయి. అదే డిజైన్‌, థీమ్‌తో భారత మాస్‌ మార్కెట్‌ వినియోగదారులకు నచ్చేలా తీసుకొచ్చిన మోడలే ఎంటీ-15. సిటీరైడింగ్‌కి అనుకూలంగా, యువ రైడర్లను దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు.

డిజైన్‌: హెడ్‌ల్యాంప్‌ విభాగం చూడ్డానికి రోబో ముఖంలా ఉంటుంది. ఇది యమహాకి ప్రత్యేకం. నలుపురంగు చక్రాలపై ఆకుపచ్చ రంగులో ఉన్న రిమ్‌లైన్స్‌ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. సింగిల్‌ పీస్‌ సీటు, పిలియన్‌ పట్టుకోవడానికి అనుకూలంగా గ్రాబ్‌రెయిల్స్‌ ఇచ్చారు. ఇంటిగ్రేటెడ్‌ టెయిల్‌ ల్యాంప్‌ వెనక సీటులోనే అమరిపోయి అందంగా కనిపిస్తోంది.

ఫీచర్లు: గతంలో బాగా సక్సెస్‌ అయిన ఆర్‌15 వీ3 మోటార్‌సైకిల్‌కి మరిన్ని ఫీచర్లు జోడించి తీసుకొచ్చిందే ఎంటీ-15. స్పీడో కన్‌సోల్‌లో మార్పు లేదు. గేర్‌ పొజిషన్‌ ఇండికేటర్‌, సగటు ఇంధన ఎకానమీ, స్పీడ్‌, ట్రిప్‌ మీటర్‌ అన్నీ చూసుకోవచ్చు. 41 ఎంఎం టెలిస్కోపిక్‌ ఫోక్స్‌ రోడ్డుమీద కుదుపుల్లేకుండా ప్రయాణం చేయడానికి సాయపడతాయి. డెల్టా బాక్స్‌ ఫ్రేమ్‌ బండి స్టెబిలిటీ, హ్యాండ్లింగ్‌, బ్యాలెన్స్‌ని ఉత్తమంగా ఉంచుతుంది. హ్యాండిల్‌బార్‌ రైడర్‌కి దగ్గరగా ఉండటంతో బండిని తేలిగ్గా కంట్రోల్‌ చేయొచ్చు. స్లిప్పర్‌ క్లచ్‌తో క్లచ్‌ ఫీల్‌ తేలిగ్గా ఉంటుంది. ట్రాఫిక్‌లో ఎక్కువగా ఉపయోగించినా చేతులు నొప్పెట్టవు. సాధారణంగా బండి బాగా వేగంగా వెళ్తున్నపుడు ఒక్కసారిగా బ్రేక్‌ వేయాల్సిన పరిస్థితి వస్తే గేర్లు త్వరగా మార్చాలి. అలా చేస్తే ఒక్కోసారి వెనక చక్రం లాక్‌ అయ్యి పడిపోయే ప్రమాదం ఉంది. స్లిప్పర్‌ క్లచ్‌ టెక్నాలజీతో ఆ ప్రమాదం జరగడానికి ఆస్కారం తక్కువ. ముందు 282 ఎంఎం, వెనక 220 ఎంఎం డిస్క్‌ బ్రేక్‌లు ఇచ్చారు. ముందు డిస్క్‌కి ఏబీఎస్‌ సేఫ్టీ ఫీచర్‌ ఉంది.

ఇంజిన్‌: ఫ్యుయెల్‌ ఇంజెక్టెడ్‌ లిక్విడ్‌ కూల్డ్‌ 155సీసీ, 19బీహెచ్‌పీ. 15ఎన్‌ఎం ఎట్‌ 8500ఆర్‌పీఎం, 6స్పీడ్‌ గేర్‌బాక్స్‌
టాప్‌ స్పీడ్‌: 135కిమీ/గం
మైలేజీ: 45కిమీ/లీ
పోటీదారులు: కేటీఎం డ్యూక్‌ 125, డ్యూక్‌ 200
ధర: రూ.1.36లక్షలు (ఎక్స్‌షోరూం)
– డీనోస్‌ వాల్ట్‌, ఆటోమొబైల్‌ బ్లాగర్‌

ఎనిమిది లక్షల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు

ఎనిమిది లక్షల కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు.. ఐదేళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీ.. కొత్తగా వచ్చిన ఫోర్డ్‌ ఫిగోలో సరికొత్తగా ప్రత్యేకతలెన్నో. అదనంగా ఫీచర్లు జత చేసినా ధర రూ.67 వేలు తగ్గించడం విశేషం. ఈ ఫేస్‌లిఫ్ట్‌ కారు విశేషాలు వివరంగా.
కొత్తగా ఏంటి?
పాత కారుతో పోలిస్తే బంపర్ల డిజైన్‌ పూర్తిగా మార్చేశారు. ముందువైపు పూర్తి సెల్యులూర్‌ స్టైల్‌ నలుపురంగు గ్రిల్‌, నీలం రంగు స్టైలిష్‌ ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్దారు. కాంట్రాస్ట్‌ రూఫ్‌, స్పోర్టీ డెకల్స్‌, పదిహేను అంగుళాల నలుపురంగు చక్రాలు, ఎనిమిది స్పోక్‌ వీల్స్‌.. చూడగానే స్పోర్ట్‌ కారులా కనిపించేలా స్టైలిష్‌గా ఉంది. చిన్నాపెద్దా అన్నీ కలిపి మొత్తం 1200 మార్పులు చేశామని చెబుతోంది ఫోర్డ్‌. అంటే దాదాపు యాభైశాతం కారు పూర్తిగా మారింది. క్యాబిన్‌ పూర్తిగా మార్చేశారు. డాష్‌బోర్డ్‌, సీట్లు.. పూర్తి నలుపురంగుపై అక్కడక్కడ నీలం రంగు చారలతో ఆకట్టుకునేలా ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ మోడళ్లలో మొత్తం ఏడు వేరియంట్లలో లభిస్తోంది. టాప్‌ఎండ్‌ మోడల్‌ టైటానియం బ్లూ.
భద్రతా ఫీచర్లు
పాత ఫిగోలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లుంటే ఫేస్‌లిఫ్ట్‌ మోడళ్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు చేర్చారు. హ్యాచ్‌బాక్‌ విభాగంలో, ఇంత తక్కువ ధరలో ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు అందిస్తున్న అతికొద్ది కార్లలో ఇదొకటి. కొండప్రాంతాల్లో తేలికైన డ్రైవింగ్‌ కోసం హిల్‌ లాంచ్‌ అసిస్ట్‌ ఫీచర్‌ ఉంది. వేగంలోనూ నియంత్రణ కోల్పోకుండా ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రాం కాపాడుతుంది. కారు రివర్స్‌ చేస్తున్నపుడు రేర్‌వ్యూ కెమెరా దానికదే స్టార్ట్‌ అయ్యి పనిచేస్తుంది. ఈబీడీతో కూడిన ఏబీఎస్‌ అదనపు బలం. హైస్పీడ్‌ అలర్ట్‌, సీట్‌బెల్ట్‌ రిమైండర్‌ ఇతర భద్రతా ఫీచర్లు.
ఆటోమేటిక్‌ డీఆర్‌ఎల్‌ హెడ్‌లైట్లు, ఏడు అంగుళాల తాకేతెరతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ వినోదాన్ని పంచుతుంది. టాప్‌ఎండ్‌ వేరియంట్‌లో 15 అంగుళాల చక్రాలుంటే, మిగతా మోడళ్లకు 14 అంగుళాల వీల్స్‌ ఉన్నాయి. బూట్‌స్పేస్‌ 257లీటర్లు. లగ్జరీ కార్లలో మాదిరిగా హెడ్‌రెస్ట్‌లున్నాయి. వర్షం వస్తున్నపుడు విండ్‌షీల్డ్‌ వైపర్లు వాటికవే పనిచేస్తాయి. ఫిగోలో ఈ టెక్నాలజీ కొత్తగా పరిచయం చేశారు.

ప్రత్యేకతలు

ఇంజిన్‌: 1.2లీటర్ల 5 స్పీడ్‌ మాన్యువల్‌, 1.5లీటర్ల 6స్పీడ్‌ ఆటోమేటిక్‌ ఇంజిన్‌తో దూసుకెళ్తుంది. 96పీఎస్‌, 120ఎన్‌ఎం టార్క్‌ ఈ విభాగంలో మేటి సామర్థ్యం ఉన్న కారుగా నిలబెట్టాయి. డీజిల్‌ బండి సత్తా మరీ ఎక్కువ. 1.5లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ 100పీఎస్‌, 215ఎన్‌ఎం ఆఫ్‌ టార్క్‌ దీని సొంతం. తొమ్మిదిన్నర సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.
మైలేజీ: 25.5కిమీ/లీ (డీజిల్‌), 20.4కిమీ/లీ (పెట్రోల్‌)
అత్యధిక వేగం: 160కిమీ/గం
పోటీదారులు: మారుతిసుజుకీ స్విఫ్ట్‌, హ్యుందాయ్‌ ఐ10
ధర: రూ.5.15లక్షల నుంచి రూ. 8.09లక్షలు (ఎక్స్‌ షోరూం ధర)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *