రూ.70.32తో తాజా జీవనకాల కనిష్ఠానికి
ముంబయి: రూపాయి రోజు రోజుకూ మరింతగా క్షీణించి కలవరపెడుతోంది. ఇప్పటికే డాలరుతో పోలిస్తే రూపాయి విలువ రూ.70 దాటిపోగా గురువారం ట్రేడింగ్‌లో తాజా జీవన కాల కనిష్ఠానికి పడిపోయింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.32కు చేరింది. టర్కీలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ టర్కీష్ లిరా భారీగా పతనమవుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రభావం మన రూపాయిపై కూడా పడుతోంది.
ఇంటర్‌బ్యాంక్ ఫారెన్ ఎక్స్ఛేంజిలో ఈరోజు రూపాయి డాలరుతో పోలిస్తే రూ.70.25 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. గత సెషన్లో రూ.69.89 వద్ద ముగియగా.. నేడు ఇంకా 43పైసలు బలహీన పడి రూ.70.32కు చేరింది. దిగుమతి దారుల నుంచి అమెరికన్ కరెన్సీ డాలరుకు డిమాండ్ బాగా పెరిగిందని ఫారెక్స్ ట్రేడర్లు చెప్తున్నారు. వాణిజ్య లోటు ఐదేళ్లలో గరిష్ఠంగా 18బిలియన్ డాలర్లకు చేరిందని మంగళవారం వాణిజ్య మంత్రి వెల్లడించడంతో ఆ ప్రభావం కూడా రూపాయి పడుతోంది. మంగళవారం రూపాయి ఓ దశలో రూ.70.08కి పతనమైంది. ట్రేడింగ్ ముగింపులో మాత్రం 4పైసలు లాభపడి రూ.69.89వద్ద ముగిసింది. బుధవారం స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫారెక్స్ మార్కెట్‌కు సెలవు. మంగళవారం ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(ఎఫ్ఐఐఎస్) దాదాపు రూ.378.84కోట్ల విలువైన షేర్లను అమ్మేసినట్లు సమాచారం.