ఈ ఫోన్‌లు అద్భుతాలు చేస్తాయ్‌!

 

ఫోన్‌ల పండగ.. మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌-2019 గత వారం ఒకటే సందడి!! ఫోన్‌లే ఫోన్‌లు. కంపెనీలన్నీ నువ్వా నేనా? అన్నట్టుగా.. సరికొత్త మోడళ్లను పరిచయం చేశాయ్‌ వాటిల్లో కొన్ని సంక్షిప్తంగా…

ముచ్చటగా మూడు


శామ్‌సంగ్‌ కంపెనీ నుంచి నెక్స్ట్‌ జనరేషన్‌ ఫోన్‌లుగా ముందుకొచ్చాయ్‌. ఎస్‌10ఈ, ఎస్‌10, ఎస్‌10ప్లస్‌. మొత్తం తెరే. స్క్రీన్‌పై నాచ్‌కి స్థానం లేదు. ఎస్‌10ఈ తెర పరిమాణం 5.8, ఎస్‌10 6.1, ఎస్‌10ప్లస్‌ 6.4 అంగుళాలు. ర్యామ్‌ 8, 12 జీబీ. స్టోరేజ్‌ సామర్థ్యం 512జీబీ నుంచి 1టీబీ. వైర్‌లెస్‌ పద్ధతిలో ఛార్జ్‌ చేసుకునే సదుపాయం ఉంది. ఈ వారంలోనే విడుదలకు సిద్ధం అవుతున్నాయ్‌. డిస్‌ప్లేలో భాగంగా సెల్ఫీ కెమెరాలు కనిపిస్తాయి. వెనక మరో మూడు కెమెరాలు.
* ఇతర వివరాలకు https://goo.gl/N5HFmX

48 మెగాపిక్సల్‌ కెమెరా

డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాలకు దీటుగా ఫోన్‌ కెమెరాల్ని మార్చేస్తూ షామీ కంపెనీ ‘మి 9’ సిరీస్‌ని పరిచయం చేసింది. కెమెరా సామర్థ్యం ఎంతో తెలుసా? 48 మెగాపిక్సల్‌. సోనీ ఇమేజ్‌ సెన్సర్‌. ప్రైమరీ కెమెరాతో పాటు మరో రెండు కెమెరాలు కనిపిస్తాయి. తెర పరిమాణం 6.39 అంగుళాలు. ముందు సెల్ఫీ కెమెరా సామర్థ్యం 20 మెగాపిక్సల్‌. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టు ఉంది. ర్యామ్‌ 8జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 128జీబీ. బ్యాటరీ సామర్థ్యం 3,300ఎంఏహెచ్‌. ‘మి9 ఎక్స్‌ప్లోరర్‌’ విషయానికొస్తే… ర్యామ్‌ 12జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 256జీబీ. ఈ నెలలోనే విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఎలాంటి నాచ్‌ లేకుండా అంచుల వరకూ తెరతో ‘మి మిక్స్‌3 5జీ’ వచ్చే మే నెల నాటికి రానుంది. 5జీ నెట్‌వర్క్‌ని సపోర్టు చేస్తుంది. 2జీబీపీఎస్‌ వేగంతో డౌన్‌లోడ్‌ చేయొచ్చు. తెర పరిమాణం 6.39 అంగుళాలు. ర్యామ్‌ 6జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 128జీబీ. స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌ని వాడారు. సెల్ఫీ కెమెరాల కోసం ఫోన్‌ని కాస్త కిందికి స్లైడ్‌ చేయాలి.
* ఇతర వివరాలకు https://goo.gl/aJrFLT

‘పాప్‌అప్‌’ అవుతుంది


ఫోన్‌ని చేతిలోకి తీసుకోగానే ముందో సెల్ఫీ కొట్టేస్తారు. క్వాలిటీ ఎలా ఉందో విశ్లేషిస్తారు. కానీ, వివో సరికొత్తగా తీర్చిదిద్దిన ఫోన్‌ని చేతిలోకి తీసుకోగానే సెల్ఫీ కెమెరా కనిపించదు. ఎంత నిశితంగా వెతికి చూసినా పట్టుకోలేరు. ఎందుకంటే.. ఫోన్‌లో ఉంది ‘పాప్‌అప్‌ సెల్ఫీ కెమెరా’. బటన్‌ని నొక్కితే సెకన్లలో బయటికి వస్తుంది. సెల్ఫీ తీసుకుని మళ్లీ కెమెరాని కనిపించకుండా చేయొచ్చు. పాప్‌అప్‌ సెల్ఫీ కెమెరా సామర్థ్యం 32 మెగాపిక్సల్‌. ఇలా తొలిసారి డిజైన్‌ చేసిన ఫోన్‌ ఇదే. తెర పరిమాణం 6.39 అంగుళాలు. వెనక మూడు కెమెరాలు. ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సల్‌. ర్యామ్‌ 8జీబీ. బ్యాటరీ సామర్థ్యం 3,700 ఎంఏహెచ్‌.
* ఇతర వివరాలకు https://goo.gl/vf1auE

మరింత పొడవుగా..

ఇప్పటికే ఫోన్‌ల పొడవు, వెడల్పుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు సోనీ మరో అడుగు ముందుకేసి 21:9 నిష్పత్తిలో ముస్తాబు చేసింది. ఫోన్‌ పొడవు 21 సెంటీమీటర్లు. వెడల్పు 9 సెంటీమీటర్లు. ‘సినిమా వైడ్‌’గా దీన్ని పిలుస్తున్నారు. అంటే.. ఫోన్‌ స్క్రీన్‌ అచ్చంగా సినిమా తెరలా కనిపిస్తుందన్నమాట. ఈ తరహాలో రూపొందించిన తొలి ఫోన్‌ ఇదే. మోడల్‌ పేరు ఎక్స్‌పీరియా 1. వెనక మూడు కెమెరాల్ని నిక్షిప్తం చేశారు. మూడింటి సామర్థ్యం 12 మెగాపిక్సల్‌. తెర పరిమాణం 6.5 అంగుళాలు. ర్యామ్‌ 6జీబీ. బ్యాటరీ సామర్థ్యం 3,330 ఎంఏహెచ్‌. దీనితో పాటు ‘ఎక్స్‌పీరియా 10 ప్లస్‌, ఎక్స్‌పీరియా 10, ఎక్స్‌పీరియా ఎల్‌3’ మోడళ్లు త్వరలోనే ముందుకు రానున్నాయి.
* ఇతర వివరాలకు https://goo.gl/hoCHHH
తెర ముట్టకుండానే..

తాకేతెరపై అంతా మునివేళ్ల పనే. తాకితే చాలు. అన్ని పనులు అయిపోతాయి. అసలు తెరనే ముట్టకుండా ఫోన్‌ కాల్‌ లిఫ్ట్‌ చేస్తే.. అలారం ఆఫ్‌ చేస్తే.. సెల్ఫీ తీసుకుంటే.. ఎల్‌జీ కంపెనీ ఇదే ఆలోచనతో ‘జీ8థింక్‌క్యూ’ ఫోన్‌ని మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. దీంతో తెరని తాకకుండానే ఫోన్‌ని ఆపరేట్‌ చేయొచ్చు. చేతితో సైగలు చేస్తే చాలు. యాప్స్‌ ఓపెన్‌ అవుతాయి. ఫొటో, సెల్ఫీ తీసుకోవచ్చు. గ్యాలరీ ఫొటోలు చూడొచ్చు. అంతెందుకు… చేతిని చూపిస్తే చాలు. ఫోన్‌ అన్‌లాక్‌ అవుతుంది. ఇప్పటి వరకూ ముఖాన్ని స్కాన్‌ చేసిన కెమెరా, ఇకపై చేతినీ దాని కదలికల్నీ స్కాన్‌ చేస్తుందన్నమాట. తెర పరిమాణం 6.1 అంగుళాలు. ర్యామ్‌ 6జీబీ. వెనక మూడు కెమెరాలు. బ్యాటరీ సామర్థ్యం 3,500ఎంఏహెచ్‌.
* ఇతర వివరాలకు https://goo.gl/wmzKop

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *