లోక్‌సభ తదుపరి స్పీకర్‌గా ఓం బిర్లా..!

దిల్లీ: పదిహేడో లోక్‌సభ స్పీకర్‌గా రాజస్థాన్‌లోని కోటా ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యే అవకాశాలు కన్నిస్తున్నాయి. స్పీకర్‌ ఎన్నికకు ఎన్డీయే అభ్యర్థిగా ఓం బిర్లా పేరు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 17వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత నూతన ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు. ఈ రోజు కూడా నూతన ఎంపీల ప్రమాణస్వీకారాలు కొనసాగనున్నాయి. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక చేపట్టనున్నారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

లోక్‌సభ కొత్త స్పీకర్‌గా గతంలో మేనకా గాంధీ సహా అనేక మంది భాజపా సీనియర్ల పేర్లు వినిపించాయి. అయితే చివరకు ఓం బిర్లా వైపు ఎన్డీయే వర్గాలు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఓం బిర్లా కోటా నుంచి రెండు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు కోటా దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌నరైన్‌ మీనాపై బిర్లా విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *