‘బిగ్‌బాస్‌ 2’ విజేతగా కౌశల్‌

హైదరాబాద్‌: ‘బిగ్‌బాస్‌ 2’ తెలుగు రియాల్టీ షో సీజన్‌ 2 విజేతగా కౌశల్‌ నిలిచారు. ప్రేక్షకుల ఓటింగ్‌ ఆధారంగా కౌశల్‌ను విజేతగా ప్రకటించారు. ఆయనకు రూ.50 లక్షల బహుమతి అందించారు. పోటీలో తుది వరకూ గీతా మాధురి గట్టిపోటీ ఇచ్చినా చివరకు కౌశల్‌నే విజయం వరించింది. ఆదివారం జరిగిన ఈ ఫినాలేకు హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన సభ్యులతోపాటు.. ఫైనలిస్టులు కౌశల్, గీత, తనీష్, దీప్తి, సామ్రాట్‌ల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఫినాలే వేడుకలో హౌస్‌మేట్స్ అంతా సందడిగా కనిపించారు. డ్యాన్సులతో అదరగొట్టారు. భావోద్వేగానికి గురయ్యారు.

ఈ షో వల్ల కౌశల్‌కు విపరీతంగా అభిమానులు ఏర్పడ్డారు. సోషల్‌మీడియాలో ‘కౌశల్‌ఆర్మీ’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారమే జరిగింది. అభిమానులు ఆయనకు మద్దుతుగా ర్యాలీ కూడా నిర్వహించారు. విజేతను ప్రకటించకముందు నుంచే కౌశల్‌ ‘బిగ్‌బాస్‌ 2’ టైటిల్‌ గెలుస్తారని అందరూ భావించారు.

సీజన్‌ 2లో మొత్తం 18 మంది కంటెస్టెంటులు పాల్గొన్నారు. గీతా మాధురి, అమిత్ తివారీ, దీప్తి నల్లమోతు, తనీష్, బాబు గోగినేని, భాను శ్రీ, రోల్ రైడా, శ్యామల, కిరీటి దామరాజు, దీప్తి సునైనా, కౌశల్, తేజస్వి మదివాడ, గణేష్, సంజనా అన్నే, సామ్రాట్, నూతన్ నాయుడు, నందిని రాయ్, పూజా రామచంద్రన్ షోలో పాల్గొన్నారు. 110 రోజులకు పైగా ఆసక్తికరంగా సాగిన ఈ సీజన్‌కు నేచురల్‌ స్టార్‌ నాని వ్యాఖ్యాతగా అలరించారు. జూన్‌ 10న ప్రారంభమైన రెండో సీజన్‌ ఇవాళ్టితో ముగిసింది.‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *