అనుకోకుండా ఓ విజేత…

ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం. మొన్న జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా మెరిస్తే.. ఈసారి ట్రాక్‌పై మంజీత్‌ మురిపించాడు. చిరుతలా పరుగెత్తిన మంజీత్‌.. అనూహ్యంగా ప్రత్యర్థులను దాటేస్తూ 800 పరుగులో పసిడి సాధించాడు.

ఇక ఎన్నో అంచనాలతో ఫైనల్లో బరిలోకి దిగిన షట్లర్‌ సింధు రజతంతో సరిపెట్టుకుంది. కొత్తగా చేరిన ఈవెంట్‌ మిక్స్‌డ్‌ 4×400లోనూ భారత్‌కు వెండి పతకం దక్కింది. పదో రోజు భారత్‌ ఖాతాలో మరో మూడు రజతాలు, రెండు కాంస్యాలు కూడా చేరాయి. భారత్‌ పతకాల పట్టికలో తొమ్మిది స్వర్ణాలు సహా 50 పతకాలతో ఎనిమిదో స్థానంలో ఉంది.

జకార్తా
ఆఖరి క్షణాల్లో అద్భుతంగా పుంజుకున్న భారత అథ్లెట్‌ మంజీత్‌ పురుషుల 800 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకున్నాడు. ఇదే ఈవెంట్లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన మరో భారత అథ్లెట్‌ జిన్సన్‌ను అతడు వెనక్కి నెట్టడం విశేషం. మంజీత్‌ ఒక నిమిషం 46.15 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి అగ్రస్థానాన్ని సాధించగా.. ఒక నిమిషం 46.35 సెకన్లతో జిన్సన్‌ రజత పతకం గెలుచుకున్నాడు. 1982 ఏషియాడ్‌ (చార్ల్స్‌ బొరోమియో) తర్వాత ఈ విభాగంలో స్వర్ణం సాధించిన భారత తొలి అథ్లెట్‌గా మంజీత్‌ ఘనత సొంతం చేసుకున్నాడు. 800 పరుగులో భారత అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలవడం 1951 (రంజిత్‌ సింగ్‌, కుల్వంత్‌ సింగ్‌) తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మంజిత్‌ పసిడి కొట్టే క్రమంలో తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. కతార్‌కు చెందిన అబ్దల్లా అబుబాకర్‌ (1:46.38) కాంస్యం సొంతం చేసుకున్నాడు. మహిళల 200మీ పరుగులో ద్యుతి చంద్‌ ఫైనల్‌ చేరుకోగా.. హిమ దాస్‌ తప్పుడు ఆరంభం కారణంగా అనర్హతకు గురైంది.

కురాష్‌లో రెండు..
కనీసం కిట్లు కొనడానికి కూడా ఇబ్బంది పడ్డ భారత కురాష్‌ (జూడో లాంటి ఆట) బృందం.. అన్ని ప్రతిబంధకాలను అధిగమించి రెండు పతకాలు సాధించింది. మహిళల 52కేజీ విభాగంలో పింకీ బల్హారా రజతం నెగ్గగా.. యల్లప్ప జాదవ్‌ కాంస్యం చేజిక్కించుకుంది. కరాష్‌ క్రీడను ఆసియా క్రీడల్లో ఆడడం ఇదే తొలిసారి. భారత కురాష్‌ క్రీడాకారులు క్రీడలకు వెళ్లిన తీరు ఆశ్చర్యం కలిగించేదే. ‘‘మా గ్రామస్థులంతా రూ.1.75 లక్షలు పోగు చేసి ఇస్తే నేను క్రీడలకు ముందు ఉజ్బెకిస్థాన్‌కు శిక్షణకు వెళ్లా. వాళ్లకెప్పుడూ రుణపడి ఉంటా’’ అని పింకీ చెప్పింది. ఆమెది దిల్లీలోని నెబ్‌ సరాయ్‌ గ్రామం. కురాష్‌ గుర్తింపు లేని క్రీడ కావడంతో ఈ క్రీడాకారుల కిట్లకు అయ్యే ఖర్చు ఇవ్వలేమని ఐఓఏ ఆసియా క్రీడలకు ముందు చెప్పింది. భారత కురాష్‌ సంఘానికి క్రీడామంత్రిత్వ శాఖ గుర్తింపు కూడా లేదు. ఈ పతకాలతో పరిస్థితి మారుతుందని సంఘం కార్యదర్శి రవి కపూర్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. 14 మంది సభ్యుల భారత కురాష్‌ జట్టులో ఎక్కువ మంది జూడో నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే.

టీటీలో తొలిసారి కాంస్యం…
ఆసియా క్రీడల్లో భారత్‌ తొలిసారి టేబుల్‌ టెన్నిస్‌ పతకం గెలుచుకుంది. టీమ్‌ విభాగంలో కాంస్యం చేజిక్కించుకుంది. సతియన్‌, ఆచంట శరత్‌ కమల్‌, ఆంథోనీ అమల్‌రాజ్‌లతో కూడిన భారత జట్టు సెమీఫైనల్లో 0-3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో పరాజయంపాలైంది. టీటీ సెమీస్‌లో ఓడిన జట్లకు కాంస్య పతకాలు ఇస్తారు.

ఆఖరి నుంచి అగ్రస్థానానికి
మంజీత్‌ సింగ్‌ విజయం నిజంగా అనూహ్యమే. స్వర్ణం కాదు కదా.. అతడు కనీసం కాంస్యమైన సాధిస్తాడని కూడా ఎవరూ ఊహించలేదు. 800మీ పరుగులో అందరి దృష్టిలోనూ ఫేవరెట్‌ జిన్సన్‌ జాన్సనే. కానీ అసాధారణ పట్టుదలను ప్రదర్శించిన మంజీత్‌ (1 నిమిషం 46.15సె).. అతణ్ని రెండో స్థానానికి పరిమితం చేశాడు. మంజీత్‌ ఎనిమిదో ఫాస్టెస్ట్‌ అథ్లెట్‌గా ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఒక నిమిషం 48.64 సెకన్లలో అతడు సెమీఫైనల్‌ను పూర్తి చేశాడు. జిన్సన్‌ క్వాలిఫికేషన్‌ దశలో అందరికన్నా అత్యుత్తమ టైమింగ్‌ (1:47.39)ను నమోదు చేశాడు. ఈ నేపథ్యంలో జిన్సనే ఫేవరెట్‌. ఫైనల్‌ రేసు కూడా అదే కోవలో మొదలైంది. జిన్సన్‌ ముందు వరుసలో ఉండగా మంజీత్‌ మాత్రం ఎక్కడో వెనుక ఉన్నాడు. తొలి ల్యాప్‌ 60 సెకన్లలోపే పూర్తయింది. అప్పటికి కూడా మంజీత్‌ బాగా వెనుకబడే ఉన్నాడు. రెండో ల్యాప్‌ నుంచి మంజీత్‌ వేగం పెంచాడు. ముందున్న వాళ్లను అందుకున్నాడు. కానీ అందరికన్నా ముందైతే లేడు. చివరి 100 మీటర్లు సమీపిస్తుండగా రన్నర్లంతా గరిష్ట వేగాన్ని అందుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ మంజీత్‌ మరింత వేగంగా పరుగెత్తాడు. అందరినీ దాటేస్తూ రేసు విజేతగా నిలిచాడు.

జ్యోతి వెండి కొండ

ఆర్చరీలో పసిడి పతకాలను ఆశించిన భారత్‌కు నిరాశ తప్పలేదు. భారత కాంపౌండ్‌ పురుషుల, మహిళల జట్లు ఫైనల్లో ఓడిపోయి రజతాలతో సరిపెట్టుకున్నాయి. ఫైనల్లో రెండు జట్లూ కొరియా జట్ల చేతిలోనే ఓడిపోవడం గమనార్హం. ఐతే భారత జట్లు గొప్పగా పోరాడాయి. అత్యంత హోరాహోరీగా సాగిన పురుషుల ఫైనల్లో రెండు జట్లు 229-229తో నిలవడంతో పోరు షూటాఫ్‌కు దారితీసింది. కానీ షూటాఫ్‌లో కూడా రెండు జట్లు 29-29తో నిలిచాయి. ఐతే నిబంధనల ప్రకారం 10 పాయింట్ల వలయానికి దగ్గరగా బాణం వేసిన కొరియా విజేతగా నిలిచింది. అభిషేక్‌ వర్మ, రజత్‌ చౌహాన్‌, అమన్‌ సైనీలతో కూడిన భారత జట్టు నిరాశకు గురైంది. ఇక మహిళల ఫైనల్లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ, మధుమిత, ముస్కర్‌ కిరార్‌లతో కూడిన భారత జట్టు 228-231తో పరాజయంపాలైంది.

ప్చ్‌.. సింధు మళ్లీ
రజతంతో సరి

మేజర్‌ ఈవెంట్లో ఆఖరి అడ్డంకిని అధిగమించడంలో పీవీ సింధు విఫలమైంది. మరోసారి రజతంతో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సింధు 13-21, 16-21తో ప్రపంచ నంబర్‌వన్‌ తైజు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయంపాలైంది. భారీ ఈవెంట్‌ ఫైనల్లో ఓడిపోవడం ఈ ఏడాది సింధుకు ఇది మూడోసారి. ఆమె ఇంతకుముందు కానమ్వెల్త్‌ గేమ్స్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో ఓడిపోయింది. తైజు యింగ్‌ చేతిలో ఓడిపోవడం సింధుకు ఇది వరుసగా ఆరోసారి. ఫైనల్లో ఓడినప్పటికీ సింధు గెలిచిన రజతం చరిత్రాత్మకమే. ఆసియా గేమ్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు ఇదే తొలి రజత పతకం.

నాడు తండ్రి.. నేడు తనయ
సింధు ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన తండ్రి, తనయగా పి.వి.రమణ, సింధు చరిత్ర సృష్టించారు. 1986 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత వాలీబాల్‌ జట్టులో రమణ కీలక ఆటగాడు. అప్పుడు రమణ కాంస్యం సాధించగా.. ఇప్పుడు సింధు రజతం గెలిచి తండ్రిని మించిన తనయగా సరికొత్త రికార్డు సృష్టించింది. సింధు- రమణల ఖాతాలో మరో రికార్డు కూడా ఉంది. 2000లో రమణకు అర్జున అవార్డు దక్కగా.. 2013లో సింధుకు అర్జున పురస్కారం లభించింది. బహుశా భారత క్రీడా చరిత్రలో అర్జున అవార్డులు, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన ఏకైక తండ్రి- తనయల జోడీ సింధు- రమణలదే కావొచ్చు!
గర్వంగా ఉంది: తండ్రి రమణ: ‘‘ఆసియా క్రీడలో నేను కాంస్య పతకం సాధించా. సింధు రజతం గెలిచింది. తండ్రిని మించిన తనయగా నిరూపించుకున్నందుకు గర్వంగా ఉంది. ఫైనల్లో ఒకరు గెలుస్తారు.. మరొకరు ఓడిపోతారు. ఫైనల్‌కు రావడమే గొప్ప విషయం. మొత్తంగా సింధు ప్రదర్శన బాగుంది’’

మిక్స్‌డ్‌ రిలేలో అదరహో

ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసిన మిక్స్‌డ్‌ 4×400 రిలేలో భారత జట్టు రజతం గెలుచుకుంది. మహ్మద్‌ అనాస్‌, పూవమ్మ, హిమ దాస్‌, రాజీవ్‌ ఆరోక్యలతో కూడిన భారత జట్టు మూడు నిమిషాల 15.71 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. బహ్రెయిన్‌ (3 నిమిషాల 11.89 సెకన్లు) స్వర్ణం గెలుచుకుంది.

భారత్‌ 20: శ్రీలంక 0
ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు హవా కొనసాగుతోంది. మంగళవారం భారత్‌ 20-0తో శ్రీలంకను చిత్తు చేసింది. ఆకాశ్‌దీప్‌ సింగ్‌ ఆరు గోల్స్‌ కొట్టగా.. రూపిందర్‌పాల్‌ సింగ్‌, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, మన్‌దీప్‌ సింగ్‌ తలో మూడు గోల్స్‌ సాధించారు. లలిత్‌ ఉపాధ్యాయ్‌ రెండు గోల్స్‌ కొట్టాడు. వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌, అమిత్‌, దిల్‌ప్రీత్‌ తలో గోల్‌ చేశారు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్‌ పూల్‌-ఎ లో అగ్రస్థానం సాధించింది. గురువారం సెమీస్‌లో మలేషియాను ఢీకొంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *