ఆసియా మనదే భారత్‌ ఖాతాలో ఏడో ఆసియాకప్‌

ఫేవరెట్‌కే పట్టం. స్వల్ప ఛేదనలో బాగా తడబడినా..
పరుగుల కోసం చెమటోడ్చినా ఆసియా కప్‌ మళ్లీ మనదే. ఒత్తిడిని జయిస్తూ, ఉత్కంఠను అధిగమిస్తూ డిఫెండింగ్‌ ఛాంపియన్‌
భారత్‌ ఏడోసారి ఆసియా కప్పును చేజిక్కించుకుంది.
ఆఖరి బంతి వరకు అత్యంత రసవత్తరంగా సాగిన ఫైనల్లో మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై కష్టపడి గెలిచింది. కుల్‌దీప్‌, జాదవ్‌, చాహల్‌ల స్పిన్‌తో బంగ్లాను కట్టిపడేసిన భారత్‌.. రోహిత్‌, కార్తీక్‌, ధోని రాణించడంతో లక్ష్యాన్ని ఛేదించింది. తీవ్ర ఉత్కంఠలో భువనేశ్వర్‌, జడేజా, కేదార్‌ జాదవ్‌ గొప్పగా పోరాడారు.
టీమ్‌ఇండియా ఆసియా విజేతగా నిలిచింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. స్పిన్నర్లు కుల్‌దీప్‌ యదవ్‌ (3/45), కేదార్‌ జాదవ్‌ (2/41), చాహల్‌ (1/31) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో మొదట భారత్‌.. బంగ్లాను 48.3 ఓవర్లలో 222 పరుగులకే కట్టడి చేసింది. లిటన్‌ దాస్‌ (121; 117 బంతుల్లో 12×4, 2×6) విలువైన శతకం సాధించాడు. రోహిత్‌ శర్మ (48; 55 బంతుల్లో 3×4, 3×6), దినేశ్‌ కార్తీక్‌ (37; 61 బంతుల్లో 1×4, 1×6), ధోని (36; 67 బంతుల్లో 3×4), కేదార్‌ జాదవ్‌ (23 నాటౌట్‌), జడేజా (23), భువనేశ్వర్‌ (21) రాణించడంతో లక్ష్యాన్ని భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లిటన్‌ దాస్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా, శిఖర్‌ ధావన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా ఎంపికయ్యారు.

ఛేదన కష్టంగా…: ఓపెనర్లు రోహిత్‌, ధావన్‌ బ్యాట్లు ఝుళిపించడంతో భారత్‌ లక్ష్యఛేదన ధాటిగానే ఆరంభమైంది. 4.3 ఓవర్లలో స్కోరు 35. ఐతే భారత్‌ 11 పరుగుల వ్యవధిలోనే ధావన్‌ (15), రాయుడు (2) వికెట్లను చేజార్చుకుంది. రోహిత్‌కు కార్తీక్‌ తోడవడంతో సాఫీగా లక్ష్యం దిశగా సాగింది. రోహిత్‌ అలవోకగా బ్యాటింగ్‌ చేశాడు. చక్కని షాట్లతో అలరించాడు. కానీ 17వ ఓవర్లో జట్టు స్కోరు 83 వద్ద రుబెల్‌ బౌలింగ్‌లో అతడు ఔట్‌ కావడంతో కాస్త ఆందోళన మొదలైంది. ఎందుకంటే అప్పటికి సాధించాల్సిన స్కోరు తక్కువేమీ లేదు. పైగా స్థిరత్వంలేని మిడిల్‌ ఆర్డర్‌పై భారం పడింది. కానీ దినేశ్‌ కార్తీక్‌, ధోని బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో ఆందోళనను తగ్గించారు. చక్కగా స్ట్రైక్‌రొటేట్‌ చేసుకుంటూ, వీలైనప్పుడల్లా బంతిని బౌండరీ దాటించారు. మొదట్లో ధోని మరీ నెమ్మదిగా ఆడాడు. 22 బంతుల్లో చేసింది 2 పరుగులే. కానీ క్రమంగా వేగం పెంచాడు. 36 ఓవర్లలో 160/4తో భారత సాఫీగా లక్ష్యం దిశగా సాగుతున్నట్లనిపించింది. కానీ ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో ధోని ఔట్‌ కావడం, జాదవ్‌ కండరాలు పట్టేసి పరుగెత్తలేని స్థితిలో ఉండడంతో భారత్‌ ఇబ్బందుల్లో పడింది. షాట్లు కొట్టలేకపోతుండడం, బంతులు వృథా అవుతుండడంతో కాసేపటికే జాదవ్‌ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బంగ్లా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఒత్తిడి పెంచారు. జడేజా, భువనేశ్వర్‌లకు పరుగులు చేయడం కష్టమైంది. అయినా ఇద్దరూ మొండిగా నిలిచారు. తొందరపడలేదు. ఒక్కో పరుగు జోడిస్తూ జట్టును నెమ్మదిగా విజయం వైపు నడిపించారు. ఒత్తిడి పెరుగుతున్న దశలో భువి అద్భుతమైన సిక్సర్‌ బాదాడు. కానీ వీళ్లిద్దరు రెండు పరుగుల తేడాతో ఔటవడంతో ఉత్కంఠ తీవ్రమైంది. చివరి 11 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన జాదవ్‌.. కాలు ఇబ్బందిపెడుతున్నా పోరాడాడు. కుల్‌దీప్‌ (5 నాటౌట్‌)తో కలిసి జట్టుకు విజయాన్నందించాడు. చివరి ఓవర్లో ఆరు పరుగులు చేయాల్సి పరిస్థితి ఏర్పడింది. వరుసగా 1 1 2 0 1 రావడంతో స్కోరు సమమైంది. ఆరో బంతికి జాదవ్‌ స్ట్రైకింగ్‌కు వచ్చాడు. ఓ లెగ్‌ బై రావడంతో విజయం భారత్‌ సొంతమైంది.

వాళ్ల దాడి… మనోళ్ల కట్టడి: మూడొందలు దాటడం ఖాయం. ఆరంభంలో బంగ్లాదేశ్‌ బాదుడు చూస్తే అందరికీ కలిగిన భావనే ఇది. కానీ ఎదురుదాడితో ప్రమాదకరంగా కనిపించిన బంగ్లాను… క్రమంగా పుంజుకున్న భారత బౌలింగ్‌ దళం కట్టిపడేసింది. ఓ దశలో 120/0తో ఉన్న బంగ్లాదేశ్‌ లైనప్‌ను కకావికలం చేసింది. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రోహిత్‌.. బంగ్లా ఆరంభం చూశాక చింతించే ఉంటాడు. మరోవైపు నుంచి మెహదీ హసన్‌ (32; 59 బంతుల్లో 3×4) సహకరిస్తుండగా.. ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ చెలరేగిపోయాడు. పేసర్లను స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న అతడు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చాహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్లో లిటన్‌ రెండు సిక్స్‌లు కొట్టాడు. 10 ఓవర్లకు స్కోరు 65/0. ఆ తర్వాత కూడా దూకుడు కొనసాగించిన లిటన్‌.. జడేజా బౌలింగ్‌లో బౌండరీతో అర్ధశతకం పూర్తి చేశాడు. ఆ వెంటనే అతడు ఔట్‌ కావాల్సింది. కానీ చాహల్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయాడు. 20 ఓవర్లలో 116/0తో బంగ్లా భారీ స్కోరు దిశగా సాగింది. ఆ దశలో బంగ్లాదేశ్‌ను భారత్‌ 222 పరుగులకు కట్టడి చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ 21 ఓవర్లో మెహదీ హసన్‌ను ఔట్‌ చేయడం ద్వారా జాదవ్‌ మొదట వికెట్‌ భాగస్వామ్యాన్ని విడదీయడంతో మ్యాచ్‌ గమనం అనూహ్యంగా మారింది. బంగ్లా పతనం వేగంగా సాగింది. స్పిన్నర్లు విజృంభించడంతో చకచకా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 33వ ఓవర్లో 151/5తో నిలిచింది. ఇమ్రుల్‌ కయెస్‌ (2)ను చాహల్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. ప్రమాదకర ముష్ఫికర్‌ (5)ను జాదవ్‌ ఔట్‌ చేశాడు. జడేజా అద్భుత ఫీల్డింగ్‌తో మిథున్‌ (2) రనౌట్‌ కాగా.. మహ్మదుల్లా (4)ను కుల్‌దీప్‌ వెనక్కి పంపాడు. మరోవైపు నుంచి పోరాటాన్ని కొనసాగిస్తూ శతకం పూర్తి చేసిన లిటన్‌కు ఎట్టకేలకు సౌమ్య సర్కార్‌ (33; 45 బంతుల్లో 1×4, 1×6) నుంచి కాస్త సహకారం లభించింది. సర్కార్‌తో ఆరో వికెట్‌కు 37 పరుగులు జోడించిన లిటన్‌ జట్టు స్కోరు 188 వద్ద ఔటయ్యాడు. లోయర్‌ ఆర్డర్‌కు భారత బౌలర్లు పోరాడే అవకాశమివ్వలేదు.

మహి మెరుపు వేగంతో..
బ్యాటింగ్‌లో వేగం తగ్గినా వికెట్‌ కీపింగ్‌ విషయంలో మాత్రం ధోని వేగంలో పెద్ద మార్పేమీ కనిపించడం లేదు. కళ్లు చెదిరే క్యాచ్‌లు, స్టంపింగ్‌లతో అతను తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు. ఆసియా కప్‌ ఫైనల్లోనూ ధోని తన వేగాన్ని చూపించాడు. సెంచరీతో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన లిటన్‌ దాస్‌.. ధోని మెరుపు స్టంపింగ్‌తోనే వెనుదిరిగాడు. కుల్దీప్‌ బంతిని కొంచెం ముందుకొచ్చి ఆడబోయాడు లిటన్‌. బంతి అతడికి చిక్కలేదు. లిటన్‌ వెంటనే వెనక్కి వెళ్లి క్రీజులో కాలు పెట్టే ప్రయత్నం చేశాడు. ఐతే ధోని బంతి ఇలా అందుకున్నాడో లేదో.. అలా వికెట్లను కొట్టేశాడు. రీప్లేను చాలాసేపు పరిశీలించిన మూడో అంపైర్‌.. చివరికి అతను ఔటని తేల్చాడు. చాలా కొద్ది తేడాలో లిటన్‌ నాటౌట్‌గా నిలిచే అవకాశాన్ని కోల్పోయాడు. తర్వాత మొర్తజాను కూడా ధోని స్టంపౌట్‌ చేశాడు.
ధోని..ఆసియా నంబర్‌వన్‌
అంతర్జాతీయ క్రికెట్లో ధోని మరో మైలురాయిని అందుకున్నాడు. ఆసియాకప్‌ ఫైనల్లో కుల్‌దీప్‌ బౌలింగ్‌లో మొర్తజాను స్టంపౌట్‌ చేయడం ద్వారా 800 ఔట్లలో పాలుపంచుకున్న తొలి ఆసియా వికెట్‌ కీపర్‌గా ధోని ఘనత సాధించాడు. మొత్తంగా టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్‌ కీపర్‌గా మార్క్‌ బౌచర్‌ (998), గిల్‌క్రిస్ట్‌ (905) తర్వాత మూడో స్థానంలో ఉన్నాడు. అంతే కాదు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంపౌట్లు చేసిన వికెట్‌కీపర్‌ (184)గా తన ఆధిక్యతను మరింత పెంచుకున్నాడు. సంగక్కర (139), కలువితరణ (101) రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు.
మళ్లీ నాగిని!

బంగ్లాదేశ్‌ క్రికెటర్లు ఆనందం పట్టలేకపోతే నాగిని నృత్యం చేస్తుంటారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో శ్రీలంకపై విజయానంతరం ఆ జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థుల్ని వెక్కిరించేలా ఆ నృత్యం చేయడం వివాదాస్పదమైంది. ఆ సిరీస్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో బంగ్లా ఓడిపోయాక స్టేడియంలోని లంక, భారత్‌ అభిమానులు కలిసి నాగిని నృత్యం చేస్తూ బంగ్లా ఆటగాళ్లను కవ్వించే ప్రయత్నం చేశారు. అప్పట్నుంచి వాళ్లు సంయమనం పాటిస్తున్నారు. ఐతే శుక్రవారం ఆసియా కప్‌ ఫైనల్లో భారత ఓపెనర్‌ ధావన్‌ క్యాచ్‌ను సౌమ్య సర్కార్‌ అందుకున్న అనంతరం బౌలర్‌ నజ్ముల్‌ ఇస్లామ్‌ నాగిని నృత్యం చేయడం చర్చనీయాంశమైంది. తర్వాత భారత ఆటగాళ్లు బౌండరీలు బాదినపుడల్లా అభిమానులు నాగిని నృత్యంతో సంబరాలు చేసుకున్నారు.
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: లిటన్‌ దాస్‌ (స్టంప్డ్‌) ధోని (బి) కుల్‌దీప్‌ 121; మెహదీ హసన్‌ (సి) రాయుడు (బి) జాదవ్‌ 32; ఇమ్రుల్‌ కయెస్‌ ఎల్బీ (బి) చాహల్‌ 2; ముష్ఫికర్‌ రహీమ్‌ (సి) బుమ్రా (బి) జాదవ్‌ 5; మహ్మద్‌ మిథున్‌ రనౌట్‌ 2; మహ్మదుల్లా (సి) బుమ్రా (బి) కుల్‌దీప్‌ 4; సౌమ్య సర్కార్‌ రనౌట్‌ 33; మష్రఫె మొర్తజా (స్టంప్డ్‌) ధోని (బి) కుల్‌దీప్‌ 7; నజ్ముల్‌ ఇస్లామ్‌ రనౌట్‌ 7; ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ నాటౌట్‌ 2; రుబెల్‌ హుస్సేన్‌ (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 7
మొత్తం: (48.3 ఓవర్లలో ఆలౌట్‌) 222
వికెట్ల పతనం: 1-120, 2-128, 3-137, 4-139, 5-151, 6-188, 7-196, 8-213, 9-222
బౌలింగ్‌: భువనేశ్వర్‌ కుమార్‌ 7-0-33-0; బుమ్రా 8.3-0-39-1; చాహల్‌ 8-1-31-1; కుల్‌దీప్‌ యాదవ్‌ 10-0-45-3; జడేజా 6-0-31-0; కేదార్‌ జాదవ్‌ 9-0-41-2
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌శర్మ (సి) నజ్ముల్‌ ఇస్లాం (బి) రుబెల్‌ 48; ధావన్‌ (సి) సౌమ్య సర్కార్‌ (బి) నజ్ముల్‌ ఇస్లాం 15; రాయుడు (సి) రహీం (బి) మొర్తజా 2; కార్తీక్‌ ఎల్బీ (బి) మహ్మదుల్లా 37; ధోని (సి) రహీం (బి) ముస్తాఫిజుర్‌ 36; జాదవ్‌ నాటౌట్‌ 23; జడేజా (సి) రహీం (బి) రుబెల్‌ 23; భువనేశ్వర్‌ (సి) రహీం (బి) ముస్తాఫిజుర్‌ 21; కుల్‌దీప్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 13;
మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 223
వికెట్ల పతనం: 1-35, 2-46, 3-83, 4-137, 5-167, 6-212, 7-214
బౌలింగ్‌: మెహదీ హసన్‌ 4-0-27-0; ముస్తాఫిజుర్‌ 10-0-38-2; నజ్ముల్‌ ఇస్లాం 10-0-56-1; మొర్తజా 10-0-35-1; రుబెల్‌ 10-2-26-2; మహ్మదుల్లా 6-0-33-1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *