అంబానీపై చైనా ఒత్తిడి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచానికే రుణదాతగా మారిన చైనా ఇప్పుడు అంబానీకి కూడా అప్పులు ఇచ్చింది. ఒక రకంగా అనిల్‌అంబానీకి చెందిన ఆర్‌కామ్‌కు అతిపెద్ద రుణదాతగా చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నిలిచింది. నిన్న ఆర్‌కామ్‌ దివాల ప్రక్రియలో భాగంగా రుణదాతల జాబితాను విడుదల చేసింది. ఇక మిగిలిన బ్యాంకులతో కలిపి మొత్తం 2.1బిలియన్‌ డాలర్లను చైనాకు చెందిన బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాలని ఆయా బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. ఆర్‌కామ్‌ చెల్లించాల్సిన అప్పుల విలువ రూ.57,382 కోట్లుగా ఈ జాబితాలో పేర్కొన్నారు.

చైనా డెవలప్‌మెంట్‌ బ్యాంకుకు రూ.9,860 కోట్లు చెల్లించాలి. ఎక్సిమ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు రూ.3,360 కోట్లు, ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు రూ.1,554 కోట్లు చెల్లించాలి.
ఇప్పటికే అప్పులు తిరిగి చెల్లించేందుకు అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ ఆస్తులను రూ.17,300 కోట్లకు జియోకు విక్రయించేలా డీల్‌ చేసుకొన్నారు. కానీ, వివిధ న్యాయ, ఇతర అంశాలతో ఈ డీల్‌ నిలిచిపోయింది. మార్చిలో అనిల్‌ అంబానీ జైలు శిక్షను ఎదుర్కొనే పరిస్థితి రావడంతో ఆయన సోదరుడు ముఖేష్‌ రంగంలోకి దిగి 80 మిలియన్‌ డాలర్లను ఎరిక్సన్‌కు చెల్లించారు.
జాబితాలో మరిన్ని విదేశీ బ్యాంకులు..
రష్యాకు చెందిన బీటీబీ క్యాపిటల్‌ ఆఫ్‌ రష్యాకు రూ.511 కోట్లు చెల్లించాలి. స్టాండర్డ్‌ ఛార్టర్డ్ బ్యాంక్‌(లండన్‌), డాయిష్‌ బ్యాంక్‌(హాంగ్‌కాంగ్‌),డీబీఎస్‌ బ్యాంక్‌, ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ బ్యాంక్‌ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ఇక భారత్‌కు చెందిన బ్యాంకులు ఇచ్చిన రుణాలను చూస్తే ఎస్‌బీఐకు రూ.4,910, ఎల్‌ఐసీకు 4,760 కోట్లు చెల్లించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *