ఆండ్రాయిడ్‌ పి అంటే ఇదే..


కొత్త ఫీచర్లతో మీ ఫోన్‌ మరింత స్మార్ట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: అత్యధిక ప్రజాదరణ పొందిన మొబైల్‌ఫోన్‌ ఓఎస్‌ ఆండ్రాయిడ్‌. ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ అందించే ఈ ఓఎస్‌కు వెర్షన్ల వారీగా వివిధ తినుబండారాల పేర్లను పెడుతూ వస్తోంది. కప్‌కేక్‌ నుంచి నౌగట్‌ వరకూ పేర్లన్నీ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఓరియో పేరుతో ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ అందిస్తోంది. త్వరలోనే ‘ఆండ్రాయిడ్‌ పి’ అధికారికంగా విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో ‘ఆండ్రాయిడ్‌ పి’కి ఏ పేరు పెట్టబోతోందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆండ్రాయిడ్‌ పి అంటే పీనట్‌ బటర్‌, పాన్‌కేక్‌, పిస్తాచియో అని కూడా అన్నారు. కానీ, ఆండ్రాయిడ్‌ పి అంటే ‘పై’ అనే పేరును గూగుల్‌ ఖరారు చేసింది. ఇందుకు సంబంధించిన ఇమేజ్‌లు కూడా తాజాగా బయటకు వచ్చాయి.

గత కొన్ని నెలలుగా గూగుల్‌ ‘ఆండ్రాయిడ్‌ పి’ని గూగుల్‌ పరీక్షిస్తోంది. ఇప్పటికే డెవలపర్‌ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. తాజాగా పేరును ఖరారు చేయడంతో పాటు, గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్లకు ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ అప్‌డేట్‌ ఇవ్వనుంది. ‘ఆండ్రాయిడ్‌ పి’ మీ స్మార్ట్‌ఫోన్‌ను మరింత స్మార్ట్‌గా మార్చనుంది. ముఖ్యంగా ఇందులోని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో అనేక ఫీచర్లను జోడించింది.\

ఆండ్రాయిడ్‌ 9పై ఫీచర్లు ఇలా..!
* ఆండ్రాయిడ్‌ పిలో ప్రధానంగా కనిపించే మార్పు టోగెల్‌ గెశ్చర్‌ కంట్రోల్‌. సాధారణ నావిగేషన్‌ బటన్స్‌తో పోలిస్తే, ఇవి కాస్త భిన్నంగా ఉంటాయి.

* ఇక ‘పై’లో ఉండే మరో సరికొత్త ఫీచర్‌ ‘అడాప్టివ్‌ బ్రైట్‌నెస్‌’, ‘అడాప్టివ్‌ బ్యాటరీ’. వీటి సాయంతో మన చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులను బట్టి స్క్రీన్‌ తనంతటి తానుగా వెలుగును మార్చుకోగలదు.

* ఆండ్రాయిడ్‌ పిలో కొత్తగా యాప్‌ యాక్షన్స్‌ను జోడించారు. మనం చేయాల్సిన పనులు ఏమేం ఉన్నాయో ముందుగానే చెప్పి, మనల్ని అప్రమత్తం చేస్తాయి. ఉదాహరణకు ఆఫీస్‌లో మన పని పూర్తయిన తర్వాత ఫోన్‌కు హెడ్‌ఫోన్స్‌ పెట్టగానే అమ్మకు ఫోన్‌ చేయాలా? లేక ప్లేలిస్ట్‌లోని పాటలను వినాలా? అని ఆప్షన్లను చూపిస్తుంది.

* ‘మ్యాప్స్‌’ అప్లికేషన్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు తీసుకొస్తూ మరిన్ని సౌలభ్యాలను జోడిస్తున్న గూగుల్.. ఈసారి విజువల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ను జోడించింది. దీని ప్రకారం ఇక గూగుల్‌ మ్యాప్స్‌ను వినియోగించే తీరులో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. మీరేదైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడ మీరు ఆ ప్రాంతాన్ని మీ ఫోన్‌ కెమెరా ద్వారా మ్యాప్స్‌లో చూడటం ద్వారా మీరు ఎటు వెళ్లాలో అందుకు సంబంధించిన డైరెక్షన్స్‌ను ఫోన్‌ స్క్రీన్‌పైనే చూపిస్తుంది.

* గూగుల్‌ తెస్తున్న కొత్త మార్పులతో జీమెయిల్‌లో మెయిల్స్‌ మరింత వేగంగా పంపించవచ్చు. కృత్రిమ మేథస్సు, మెషిన్‌ లెర్నింగ్‌ సాయంతో స్మార్ట్‌ కంపోజర్‌ మరింత వేగంగా వినియోగదారులకు వాక్యాలను సూచిస్తూ పూర్తి చేస్తుంది.

* ప్రస్తుతం ఉన్న గూగుల్‌ ఫొటోస్‌కు మరికొన్ని ఆసక్తికర ఫీచర్లను గూగుల్‌ జోడించింది. ఓ ఫొటోలోని బ్యాగ్రౌండ్‌ని నలుపు తెలుపుల్లోకి మార్చడంతో పాటు నలుపు తెలుపులో ఉన్న ఫొటోలను ఏఐ సాయంతో రంగుల్లోకి మార్చుకునే సౌలభ్యాన్నీ అందించబోతోంది. దీంతో పాటు రొటేట్‌, బ్రైటెన్‌, షేర్ వంటి ఆప్షన్లను జోడిస్తోంది.

* దాదాపు ప్రతి ఆండ్రాయిడ్‌ మొబైల్‌లోనూ గూగుల్‌ అసిస్టెంట్‌ ఉంటుంది. తాజాగా ఆరు కొత్త స్వరాలను గూగుల్‌ జోడిస్తోంది. అంతేకాదు కొత్తగా తీసుకొస్తున్న ‘కన్‌టిన్యూయడ్‌ కన్వర్జేషన్‌ ఫీచర్‌’ సాయంతో ఇక ప్రతిసారి ‘ఓకే గూగుల్‌’ అనాల్సిన అవసరం లేదు. అప్లికేషన్‌ డిజైన్‌ను సైతం మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *