ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం…

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా శంబంగి చిన వెంకట అప్పలనాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమావేశాలు ప్రారంభం సందర్భంగా అసెంబ్లీ భవనం ప్రదాన ద్వారం, సీఎం వెళ్లే ద్వారాలకు పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు.అసెంబ్లీలో ప్రతిపక్షానికి తాత్కాలిక ఛాంబర్లు కేటాయించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు, టీడీఎల్పీకి పక్కపక్కనే గదులను కేటాయించారు.

ప్రొటెం స్పీకర్‌ అప్పలనాయుడు..కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్యమంత్రి జగన్‌ తొలుత ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆతర్వాత చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రతిపక్షనేత చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అనంతరం అక్షర క్రమంలో మిగిలిన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు.

మంత్రుల ప్రమాణ స్వీకారం రోజు ఏర్పడిన ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారామ్‌ను రేపు అధికారికంగా ఎన్నుకోనున్నారు. ఈనెల 14న ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *