అడ్వాణీకి రాజకీయ విశ్రాంతి…!

 

184 మందితో భాజపా తొలి జాబితా
ఈసారీ వారణాసి నుంచే నరేంద్రమోదీ
గాంధీనగర్‌లో అమిత్‌షా
దత్తాత్రేయ, హరిబాబులకు దక్కని చోటు
కిషన్‌రెడ్డి, డి.కె.అరుణ, పురందేశ్వరిలకు అవకాశం
మంత్రి కృష్ణరాజ్‌, 22 మంది సిట్టింగ్‌లకు హుళక్కి
ఏపీ నుంచి 2, తెలంగాణ నుంచి పది పేర్ల వెల్లడి

ఈనాడు, దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను కాషాయదళం గురువారం ప్రకటించింది. మొత్తం 23 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 184 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మళ్లీ తన సిట్టింగ్‌ స్థానం వారణాసి నుంచే పోటీకి దిగుతారని ప్రకటించింది. భాజపా వ్యవస్థాపకుడు ఎల్‌కే అడ్వాణీకి రాజకీయ విశ్రాంతి నిచ్చింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీనగర్‌ స్థానంలో అమిత్‌షా పోటీ చేయనున్నారు. మొత్తం 23 మంది కేంద్ర మంత్రులకు తొలి జాబితాలో స్థానం కల్పించింది. ఒక్క మంత్రిని పక్కనపెట్టింది. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌గడ్కరీ, స్మృతీఇరానీలు పాతస్థానాలైన లఖ్‌నవూ, నాగ్‌పూర్‌, అమేఠీల నుంచే పోటీకి సిద్ధమయ్యారు. 22 మంది సిట్టింగ్‌ ఎంపీలను పక్కనపెట్టింది. ఇందులో అగ్రనేత అడ్వాణీతో పాటు ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రులు బీసీ ఖండూరీ, భగత్‌సింగ్‌ కోషియారితోపాటు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయలు ఉన్నారు. వయోభారం రీత్యా వీరికి సెలవు ఇచ్చినట్లు కనిపిస్తోంది. కేంద్ర వ్యవసాయశాఖ సహాయమంత్రి కృష్ణరాజ్‌ను పక్కనపెట్టి ఆ స్థానంలో బీఎస్పీ నుంచి ఈ మధ్యే పార్టీలోకి వచ్చిన అరుణ్‌సాగర్‌కు టికెట్‌ కట్టబెట్టింది. విశాఖపట్నం నుంచి సిట్టింగ్‌ ఎంపీ కంభంపాటి హరిబాబు మళ్లీ పోటీచేయడానికి సుముఖత చూపకపోవడంతో ఆ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరికి అవకాశం కల్పించింది.

ఆమేఠీలో రాహుల్‌పై స్మృతి ఇరానీ
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఈసారీ అమేఠీలో రాహుల్‌గాంధీతో తలపడనున్నారు. ప్రముఖ సినీనటి హేమమాలినికి రెండోసారి కూడా ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మథుర స్థానం లభించింది.

అడ్వాణీ కుమార్తెకు టికెట్‌ ఎలా ఇస్తాం?
భాజపా వ్యవస్థాపకుడు అడ్వాణీకి 91 ఏళ్లు రావడంతో వయసును కారణం చూపి ఆయనకు టికెట్‌ నిరాకరించారు. దీన్ని ముందుగానే ఊహించిన ఆయన తన కుమార్తె ప్రతిభా ఆడ్వాణీకి ఇవ్వాలని కోరినట్టు సమాచారం. పార్టీ ఎన్నికల కమిటీ ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్టు తెలిసింది. ‘‘అడ్వాణీజీ జీవితమంతా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆమెకు టికెటిస్తే భాజపాకు నష్టం కలుగుతుంది’’ అని పేర్కొన్నట్టు సమాచారం.

గాంధీనగర్‌ నుంచే అమిత్‌ షా ఎందుకంటే?
అడ్వాణీ ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్‌ నుంచి ఈ సారి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా ఉత్తర్‌ప్రదేశ్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గుజరాత్‌లోని వడోదరతో పాటు, వారణాసిలోనూ పోటీ చేశారు. ఈ సారి మోదీ వారణాసికే పరిమితయ్యారు. దాంతో రాష్ట్రంలో ఓ అగ్రనేత రంగంలో ఉండాలన్న ఉద్దేశంతో అమిత్‌ షా పోటీకి దిగారు.

బెదిరించి టికెట్‌ పొందిన సాక్షి మహరాజ్‌
వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన సాక్షి మహారాజ్‌ దాదాపుగా బెదిరించి టికెట్‌ సంపాదించారు. ఆయన మరోసారి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌ నుంచి పోటీ చేయనున్నారు. కాన్పూర్‌, లఖ్‌నవూ మధ్యనున్న ఈ ప్రాంతం రాజకీయంగా కీలకమైనది. ఆయన ఆశ్రమం అక్రమ మద్యం నుంచి ఎన్నో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిలయమని ఆరోపణలు ఉన్నాయి. ఈసారి ఆయనను మారుస్తారని భావించగా, తనకు టికెట్‌ ఇవ్వకపోతే ఉన్నావ్‌తో పాటు, ఇతర ప్రాంతాల్లోనూ పార్టీ ఓడిపోతుందంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టారు. దీనిపై పార్టీ నాయకత్వం ఖండించినా చివరకు టికెట్‌ ఇచ్చింది.

-చోటు దక్కించుకున్న మంత్రులు, సిట్టింగ్‌ ఎంపీలు అవకాశాలు కోల్పోయిన స్థానాల వివరాలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *