12 గంటలు 50లక్షల వ్యూస్‌…


‘అరవింద సమేత వీరరాఘవ’ ట్రైలర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. మంగళవారం జరిగిన ప్రీరిలీజ్‌ వేడుకలో థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం 12 గంటల్లోనే 50లక్షల మందికి పైగా ఈ ట్రైలర్‌ను వీక్షించారు.

ఎన్టీఆర్‌ పాత్ర రెండు భిన్న పార్శ్వాల్లో సాగుతుందని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. పూజా హెగ్డే చుట్టూ వచ్చే సన్నివేశాల్లో లవర్‌బాయ్‌గా కనిపించిన తారక్‌‌, రాయలసీమ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో తనదైన మాస్‌ యాక్షన్‌తో కట్టిపడేశారు. ‘మదిరప్పా.. ఇక్కడ మంది లేరా? కత్తులు లేవా?’ అంటూ ఆయన పలికిన సంభాషణ అభిమానులను విశేషంగా అలరిస్తోంది.

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబరు 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *