కోహ్లీ..బ్యాట్స్‌మెన్‌గా ఎప్పుడూ సంతృప్తి చెందకు నీ లక్ష్యాలపైనే దృష్టి పెట్టు: సచిన్‌


లండన్‌: ‘నీ మనసు ఏం చెబుతుందో దాన్నే నమ్ము. నువ్వు అందుకోవాలనుకున్న లక్ష్యాలపైనే దృష్టంతా పెట్టు’ ఈ వ్యాఖ్యలు ఎవరు అన్నారో తెలుసా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌. ఇంతకీ ఎవర్ని ఉద్దేశించి సచిన్‌ ఇలా అన్నారో తెలుసా.. భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీని.

భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ప్రస్తుతం ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ జరుగుతోంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్‌ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో పలువురు పుజారాను జట్టులోకి తీసుకోకపోవడం, ధావన్‌కు చోటు కల్పించడం తదితర అంశాలపై కోహ్లీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. మరో పక్క ఇంగ్లాండ్‌ కూడా కోహ్లీ కోసం ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేస్తోంది.

ఈ నేపథ్యంలో కోహ్లీని ఉద్దేశించి సచిన్‌ మాట్లాడాడు. ‘ఈ సందర్భంగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం నువ్వు ఎలా నీ పనిని చేసుకుపోతున్నావో.. అదే కొనసాగించు. నీ చుట్టూ జరిగే దాని గురించి ఆందోళన చెందకు. నీ మనస్సు ఏం చెప్తుందో అదే నమ్ము. నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో దానిపైనే దృష్టి పెట్టు. అనుకూలంగానే ఫలితాలు వస్తాయి. నా అనుభవం మేరకు ఒకటి చెబుతున్నా.. ఇంకా పరుగులు సాధించు. ఇక్కడితో సంతృప్తి చెందకు. ఎప్పుడైతే నువ్వు సంతృప్తి చెందడం అలవాటు చేసుకుంటావో అప్పుడే నీ పతనం కూడా ప్రారంభమౌతుంది. ఇక బౌలర్‌ ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు మాత్రమే తీయగలడు. అదే బ్యాట్స్‌మెన్‌ అయితే ఎన్ని పరుగులైనా సాధించవచ్చు. పరిమితి ఉండదు. అందుకే బ్యాట్స్‌మెన్‌గా నువ్వు ఎప్పుడూ సంతోషపడు.. అంతేకానీ సంతృప్తి చెందకు’ అని సచిన్‌ అన్నారు.

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన టెస్టులో కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 200 పరుగులు చేశాడు. సచిన్‌ ఇచ్చిన సలహా మేరకే అండర్సన్‌ బౌలింగ్‌ను కోహ్లీ క్రీజు నుంచి కాస్త ముందుకు వచ్చి ఎదుర్కొంటున్నాడు. బంతి మరీ స్వింగ్‌ అయితే అండర్సన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టమని చెప్పిన సచిన్‌.. 40సెంటీమీటర్లు ముందుకు వచ్చి అతని బౌలింగ్‌ ఎదుర్కోవాలని సలహా ఇచ్చాడట. ఒక సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య గురువారం రెండో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *